: కేసీఆర్ కు పట్టిన దయ్యాన్ని వదిలించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిందే: రేవంత్ రెడ్డి


రైతులకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ నేతలు చేపట్టిన 'రైతు పోరుబాట'పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతలను వారు మిడతల దండుగా అభివర్ణించారు. దీంతో, వీరి విమర్శలను టీటీడీపీ నేతలు తిప్పికొట్టారు. తమది మిడతల దండు కాదని... రైతులకు అండగా ఉండే రామదండు అని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తాము రామదండులా పోరాటం చేస్తామని టీడీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గాలికొదిలేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, రైతులకు రుణమాఫీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వారి కన్నీటిని తుడిచేందుకు కూడా సీఎంకు తీరిక ఉండటం లేదని విమర్శించారు. రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేయడానికి ప్రభుత్వం వద్ద రూ. 17 వేల కోట్లు లేవా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను చీల్చి చింత చెట్టుకు కట్టాలన్నా, కేసీఆర్ కు పట్టిన దయ్యాన్ని చింత బరిగెతో వదిలించాలన్నా ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News