: ప్రాంతీయ సినీ పరిశ్రమ చచ్చిపోతుందని చెప్పగానే అరుణ్ జైట్లీ స్పందించారు: సురేష్ బాబు

ప్రాంతీయ సినీ పరిశ్రమను బతికించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరామని ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు తెలిపారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తో కలిసి వెళ్లి సమావేశమైన అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ, జీఎస్టీ బిల్లు కారణంగా ప్రాంతీయ సినీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పామన్నారు. జీఎస్టీ బిల్లు అమలైతే దేశంలో ఒకే పన్ను విధానం నడుస్తుందని, దీంతో జాతీయ, అంతర్జాతీయ సినిమాలు ప్రాంతీయ సినిమాలను చంపేస్తాయని ఆందోళన వ్యక్తం చేశామని అన్నారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ రాష్ట్రాలిచ్చే రాయితీలతో జీవం పుంజుకుంటుందని, జీఎస్టీతో అది పోతుందని, అందుకే ప్రాంతీయ సినిమాలను ఆదుకోవాలని కోరామని అన్నారు. ప్రాంతీయ సినిమాలు ఆ ప్రాంతం యొక్క సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, వాటికి మద్దతు తెలపాలే తప్ప వాటికి చేజేతులా నష్టం చేయకూడదని కోరామని అన్నారు. దీంతో ఆయన వేగంగా స్పందించారని, జీఎస్టీ అమలు సందర్భంగా సినీ రంగానికి ఏం చేస్తారో చూడాలని, ప్రాంతీయ సినిమాకు లాభం కలిగే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. అరుణ్‌ జైట్లీని కలిసిన వారిలో కేటీఆర్, సురేష్ బాబుతో పాటు సి.కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News