: నిన్నటి వరకు భారత్, ఇప్పుడు ట్రంప్... చైనా మీడియా తీరిదే!
నిన్నటి వరకు భారత్ పై దుమ్మెత్తిపోసిన చైనా మీడియా ఇప్పుడు తన దృష్టిని ట్రంప్ మీదకు మళ్లించింది. తనకు నచ్చని ప్రపంచ దేశాలపై ఎప్పుడూ నిప్పులు చెరిగే చైనా మీడియా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో తట్టుకోలేకపోతోంది. హిల్లరీ క్లింటన్ గెలుస్తారని తమ వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలకు ఎలాంటి ప్రతిబంధకం ఉండదని ఎన్నో లెక్కలు వేసి, ఆశలు పెంచుకున్న ‘బీజింగ్ మౌత్ పీస్’ (మీడియా సంస్థలు) లకు ట్రంప్ విజయం జీర్ణం కావడం లేదు. దీంతో చైనా ప్రధాన పత్రికల ఎడిటోరియళ్ల నిండా ట్రంప్ పై ఆరోపణలతో దుమ్మెత్తిపోశాయి. అమెరికా సహా ప్రపంచం మొత్తం ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరించడం లేదని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొడంతో ఆగకుండా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఏదో తేడా’ జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది. ట్రంప్ విజయం అమెరికా రాజకీయాలకు భారీ దెబ్బ అని అభిప్రాయపడింది. ప్రధానంగా అమెరికా మీడియా ట్రంప్ ను అలక్ష్యం చేసిందని విమర్శించింది. అలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడంటే ప్రస్తుతమున్న అమెరికా రాజకీయాల్లో ఏదో తప్పు ఉండే ఉంటుందని పేర్కొంది. అంతే కాకుండా దీపావళి ముందు 'బ్యాన్ చైనా ప్రోడక్ట్స్' ఉద్యమం సమయంలో భారత్ పై బెదిరింపులకు దిగినట్టుగా, భవిష్యత్తులో జరిగే చైనా-అమెరికా బంధం, రష్యా-అమెరికా సంబంధాల ప్రభావం మొత్తం అంతర్జాతీయ సమాజం మీద పడుతుందని ఏకంగా ప్రపంచంపైనే బెదిరింపులకు దిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ లాగే ట్రంప్ కూడా ‘విన్-విన్’ (తమ వ్యాపారాలు, ఉద్యోగాలకు అడ్డు రాకుండా) పాలసీతో వెళ్తే బాగుంటుందని ముందస్తు సూచనలు చేసింది. అలా కాకుండా ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని టార్గెట్ చేస్తే కనుక చైనా తన సొంత బలంతో తనను తాను రక్షించుకోవాల్సి ఉంటుందని కథనాలు వండుతోంది.