: జగనా? చంద్రబాబా?... మీకు ఎవరు ఆదర్శం?: విద్యార్థులతో ముఖాముఖిలో లోకేష్
విజయవాడలోని సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో టీడీపీ నేత లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. సరైన నాయకత్వంలో నడిస్తే ఎవరైనా అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతి చేసి, 12 మందిని జైలుకి పంపి, స్వయంగా జైలుకు వెళ్లిన వ్యక్తి నాయకత్వంలో నడవడాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? అని అడిగారు. ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబునాయుడు ఉన్నారని, వారిలో ఎవరిని అనుసరిస్తారని అక్కడి విద్యార్థులను ఆయన ప్రశ్నించారు. భారతీయ విద్యావ్యవస్థకు, అమెరికన్ విద్యావ్యవస్థకు చాలా వ్యత్యాసముందని ఆయన చెప్పారు. తాను భారతీయ విద్యావ్యవస్థలో ఎక్కువ కాలం చదవలేదు కనుక దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పడం ఇబ్బందేనని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత తన విద్యపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని ఆయన అనడంతో అంతా నవ్వేశారు. అమెరికన్ విద్యావ్యవస్థలో బట్టీపట్టడం అన్న అంశం ఉండదని అన్నారు. తరగతిలో టీచర్ ఒక అంశం చెప్పి దానిని అనుసరించేలా చేస్తారని చెప్పారు. అప్లికేషన్ ఎక్కువగా ఉండడంతో అక్కడి విద్యావ్యవస్థ మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు.