: సినిమాల్లో పోరాటం చేయడం చాలా తేలిక.. రాజకీయాల్లో అలా కాదు!: పవన్ కల్యాణ్
హోదాతో పాటు పలు సమస్యల గురించి వింటుంటే తనకు చాలా విసుగు వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ‘సినిమాల్లో పోరాటం చేయడం చాలా తేలిక. ఒక్క విలెన్ తో రెండున్నర గంటలు పోరాడితే అయిపోతుంది. కానీ, నిజజీవితంలో తరాల తరబడి పోరాటాలు చేయాలి. ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు కూడా.. నిరంతరం పోరాటం చేయడానికి జనసేన ముందుంటుంది. పారిశ్రామికవేత్తల్లో కొన్ని కులాల వారు కనపడరు. దళితుల నుంచి అన్ని కులాల వారికి ప్రోత్సాహం అందాలి. వారు వ్యాపారం చేయడానికి అనువుగా కొన్ని పాలసీలు తీసుకురావాలని చూస్తున్నాము. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మీ పనులు మొదలు పెట్టవచ్చుకదా? అని కొందరు అంటున్నారు. కానీ కరెక్టు కాదు... ఎన్నికల ముందు పోరాటానికి దిగడం సరికాదు. జనసేన ఆ ఉద్దేశంతో రాలేదు.. మీకు బిడ్డగా నేను అండగా ఉంటాను.. ఏ జిల్లాలు వెనకబడి పోయాయో ఆ జిల్లాల కోసం నేను పోరాడతా. దేశంలోనే అత్యంత కరవుగా ఉన్న ప్రాంతం అనంతపురమే’ అని పవన్ అన్నారు. ‘కడుపు మండిన అనంతపురం నుంచే నా పోరాటానికి శ్రీకారం చుడతా. సరికొత్త రాజకీయ వ్యవస్థలతో కూడిన రాజకీయాలు చేద్దాం. ఏ వర్గాలు, కులాలను వెనకకు నెట్టేశారో వారికి జనసేన అండగా ఉంటుంది. మనకు సీఎం చెప్పారు. సింగపూర్ తరహా వ్యవస్థకావాలని.. సింగపూర్ అంటే ఎత్తైన భవనాలు కాదు. అక్కడ లంచగొండితనం లేదు... లంచం తీసుకుంటే సొంతవారినే జైలులో పెట్టిస్తారు. సొంత మనుషులను కూడా శిక్షించాలి తప్పు చేస్తే. అలాంటి వ్యవస్థ కావాలి, డబ్బులతో కొనసాగే రాజకీయాలు కాదు... సమస్యలపై, అవినీతిపై పోరాటం చేసే రాజకీయాలు కావాలి.. ప్రజలకు ఉపయోగపడని పక్షంలో జనసేన అటువంటి నాయకులపై పోరాటం చేస్తుంది.. గెలుస్తుంది’ అని పవన్ వ్యాఖ్యానించారు.