: అలసిపోయాం, విసిగిపోయాం, మోసపోయాం...చంద్రబాబును నేను అడిగేది ఇదే!: పవన్ కల్యాణ్


అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "వచ్చే ఏడాది నా పార్టీ కార్యాలయాన్ని అనంతపురం నుంచే ప్రారంభిస్తాను... కచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. మనకి రావాల్సిన వాటానే మనకి ఇచ్చినప్పుడు దానిని ఏ రకంగా మెచ్చుకుంటారు. చంద్రబాబును నేను అడిగేది ఇదే... ప్రత్యేక ప్యాకేజీకి ఓ కవర్ తొడిగి ఇస్తే... దానిని ఎలా అంగీకరించారు? ఎలా మెచ్చుకుంటున్నారు? రాజకీయాలంటే తిట్టుకోవడమనే సంప్రదాయం బలపడిపోయింది. జనసేన పార్టీది విధానాలు, సిద్ధాంతాలపై పోరాటమే తప్ప, వ్యక్తులపై పోరాటం చేయదు. చంద్రబాబుపై కానీ, జగన్ పై కానీ నాకు వ్యక్తిగత వైరం లేదు. కానీ ప్రజా సమస్యలకు అండగా, మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నప్పుడు మాత్రం నేను శత్రువునే. చాలా బలమైన శత్రువును. నాకు పదవులు, డబ్బులు అవసరం లేదు. ప్రజాసమస్య పరిష్కారం కావాలి. అలసిపోయాం. విసిగిపోయాం. ఇంకెంతకాలం ఈ మోసాలు? ఇక చాలు, ఇప్పటికైనా వ్యవస్థ మారాలి. నేను చేతులు కట్టుకుని కూర్చుంటే గౌరవ మర్యాదలు, డబ్బులు వస్తాయి. అన్నింటినీ ఫణంగా పెట్టి ప్రజా ప్రతినిధిగా వస్తున్నాను. ఒక జనరేషన్ రాజకీయ నేతలు చేసిన తప్పుల కారణంగా ఈ రోజు ఈ దుస్థితికి దిగజారాం. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు. జై కిసాన్ అంటున్నాం... అన్నం పెట్టే రైతును చంపుకుంటున్నాం. విదేశాల కలల్లో విహరిస్తున్నాం. కానీ రైతును పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. రైతుకు జనసేన అండగా నిలబడుతుంది. అన్నముంటేనే పరిశ్రమలు, సంపదతో పని ఉంటుంది. ప్రతి దేశానికి రైతు, సైనికుడు ఉండితీరాలి. వీరికి అండగా అందరూ నిలబడాలి. టీడీపీకి మద్దతుగా ఉన్నాను. మీకు ప్రచారం చేశాను కనుక ఒక సలహా ఇస్తున్నాను. టీడీపీ మీద ప్రజలకు నమ్మకం పోయింది. అవినీతి పెరిగిపోతోందని ప్రజలు చెబుతున్నారు. కుటుంబాన్ని కాదని నేను మీకు మద్దతు పలికాను. ఈ రోజు ప్రజలందరితో ఉన్నామని చెప్పాల్సిన ప్రభుత్వంపై ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోండి. ఏదో ఒక కులానికి, ప్రాంతానికి, వర్గానికి అని కాకుండా అందరికీ అండగా నిలవండి. అమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వేరైపోయినట్టు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి విభజన రాకుండా జాగ్రత్తపడండి. రాజధాని కేవలం డబ్బున్నవారికి మాత్రమేనా? లేక రాష్ట్ర ప్రజలందరిదీనా? రాజధాని ఎలా ఉండబోతోంది? మరోసారి ప్రజలందరికీ రాజధాని ఎలా ఉంటుందో చెప్పండి" అన్నారు పవన్

  • Loading...

More Telugu News