: అనంతపురం చేరుకున్న పవన్‌కల్యాణ్.. కాసేపట్లో సభ ప్రారంభం.. భారీగా చేరుకున్న అభిమానులు
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ అనంతపురంలో నిర్వహించతలపెట్టిన సభ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఆయన దాదాపు గంటన్నర పాటు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ నిర్వహించిన సభల్లాగే సభా వేదికపై పవన్‌కల్యాణ్ ఒకరే ఉంటారు. సభలో పాల్గొనడానికి కొద్దిసేపటి క్రితం అనంతపురం చేరుకున్న పవన్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పవన్ సభ దృష్ట్యా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ నిర్వహించిన సభల్లో ప్రత్యేక హోదాపైనే ఆయన ప్రసంగం కొనసాగింది. కొన్ని రోజుల క్రితం ఆయనను ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు కలిసి తమ కష్టాలను గురించి వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై కూడా పవన్ గళం విప్పే అవకాశం ఉంది. మరోవైపు నిన్న రద్దయిన పెద్దనోట్ల అంశంపై కూడా పవన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని అభిమానుల అంచనా. నల్లధనం అంశంపై కూడా ఆయన ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇటీవలే జనసేన పార్టీ సోషల్ మీడియాలో అధికారికంగా ఖాతాలను తెరచిన విషయం తెలిసిందే. మరోవైపు, ట్విట్టర్ లో పవన్ అభిమానులు యాష్ జనసేన ప్రస్తానం అనంతపురం (#JanaSenaPrasthanamAnantapur) పేరుతో ట్యాగ్ రూపొందించి పవన్ సభకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్ డేట్లు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.