: యూపీ, పంజాబ్, గోవా ఎన్నికల ముందు నల్లధనాన్ని అడ్డుకునేందుకు వీలవుతుంది: సిద్ధార్థనాథ్ సింగ్
పెద్ద నోట్ల రద్దుపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ స్పందించారు. ఈ రోజు విజయవాడలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... నల్లధనం నిరోధానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు కొన్ని రోజులు మాత్రమే ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో నల్లధన ప్రవాహాన్ని నిరోధించవచ్చని సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. ఏపీలోనూ ఎన్నికల సందర్భంగా అవినీతి పరులు నల్లధనాన్ని పంచుతున్నారని, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలు కూడా ఒక భాగమై ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికాతో భారత్ కొత్త మార్గంలో సత్సంబంధాలు కొనసాగిస్తోందని ఆ దేశంలో అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ నియామకం జరిగిన తరువాత కూడా ఇదే విధంగా కొనసాగుతాయని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.