: తమ వద్ద ఉన్న రూ. 54 లక్షలు చెల్లవన్న భయంతో మహిళ ఆత్మహత్య


పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలువురి పాలిట శరాఘాతంగా మారింది. తమ వద్ద ఉన్న డబ్బును ఎలా మార్చుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పినప్పటికీ... చాలా మంది ఆందోళనకు గురవుతూనే ఉన్నారు. డబ్బుకు సంబంధించిన లెక్కలు సరిగా ఉంటే... ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తెలిపింది. నల్లధనం కలిగిన వారికి మాత్రమే ప్రభుత్వ చర్యలతో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పింది. ఏదేమైనప్పటికీ, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమ వద్ద ఉన్న రూ. 54 లక్షలు చెల్లవన్న భయంతో కందుకూరి వినోద (55) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని శెనగపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆమె భర్తకు కొంత కాలం క్రితం పక్షవాతం వచ్చింది. ఈ నేపథ్యంలో, తమకు ఉన్న 12 ఎకరాల భూమిని రూ. 56.40 లక్షలకు ఆమె అమ్మేసింది. అందులో భర్త వైద్యానికి రూ. 2 లక్షలు ఖర్చు చేసింది. మిగిలిన రూ. 54 లక్షలతో వేరే ప్రాంతంలో భూమి కొనేందుకు యత్నిస్తోంది. ఈ సమయంలో... పెద్ద నోట్లు రద్దయిపోయాయని, ఈ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానమని ఆమెకు ఎవరో చెప్పారు. ఇదే విషయాన్న భర్తకు, కుమారుడికి ఆమె చెప్పింది. చెప్పినా వినకుండా మొత్తం భూమిని అమ్మేశావంటూ ఆమెను వారు మందలించారు. డబ్బు మొత్తం పనికి రాకుండా పోయిందనే బాధతో... ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

  • Loading...

More Telugu News