: మెడకు ఉరేసుకుని టాటా చెబుతూ సెల్ఫీ దిగి, ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులున్నాయన్న కారణంతో నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ క్యాబ్ డ్రైవర్, మెడకు ఉరేసుకుని, ఈ లోకాన్ని వీడి పోతున్నానని టాటా చెబుతూ, సెల్ఫీ తీసుకుని మరణించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కె.క్రాంతికుమార్ (28) బతుకుదెరువు కోసం రామాంతపూర్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్ని మానసిక సమస్యలున్న క్రాంతికుమార్, తానేమైపోతానో అన్న బెంగతో ఆత్మహత్యకు దిగాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ లేఖ రాసి, సెల్ఫీ దిగుతూ అందరికీ టాటా చెప్పి తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సూసైడ్ నోట్ ను, సెల్ఫీలు దిగిన ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సూసైడ్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.