: 'పెద్ద నోట్ల రద్దు' నాడు.. జపాన్ తో ఒప్పందాలపై చర్చలకని పిలిచిన మోదీ... మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు బందీ!
సరిగ్గా రెండు రోజుల క్రితం... మంగళవారం మధ్యాహ్నం అందుబాటులోని కేంద్రమంత్రులంతా క్యాబినెట్ సమావేశానికి హాజరు కావాలని ప్రధాని మోదీ కార్యాలయం నుంచి వర్తమానం వెళ్లింది. ఎందుకోసం ఈ సమావేశం? అని ఆరా తీసిన వారికి జపాన్ పర్యటనకు మోదీ బయలుదేరనున్న సందర్భంగా ఆ దేశంతో చేసుకోవాల్సిన ఒప్పందాలపై చర్చించేందుకన్న సమాధానం వచ్చింది. ఆపై రాత్రి 6:45 గంటల ప్రాంతంలో మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం అయి, నోట్ల రద్దును, అది కూడా నేటి అర్ధరాత్రి నుంచేనని చెప్పారు. అందుకు అవసరమైన క్యాబినెట్ అనుమతి కోసమే అందరినీ పిలిచినట్టు చెప్పి వారిపై బాంబేశారు. ఆపై ఎవరినీ బయటకు కదలనీయలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ముగిసిన తరువాతనే కేంద్ర మంత్రులను బయటకు పంపారు. మంత్రులతో పాటు సమావేశానికి హాజరైన ఆర్బీఐ అధికారులనూ ఇదే విధంగా క్లోజ్డ్ డోర్ అరెస్ట్ చేశారు. పాత నోట్ల రద్దుపై ఏ విధమైన లీకులూ బయటకు వెళ్లకుండా చూసేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు తమ సెల్ ఫోన్లను వదిలి, ఓ గదిలో కూర్చోవాల్సి వచ్చింది. రాత్రి 6:45 నుంచి 9 గంటల వరకూ వీరంతా గదిలోనే ఉండిపోయారు.