: ఐటీపై ట్రంప్ ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు?
అంచనాలను తలకిందులు చేస్తూ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో భారతీయ ఐటీ పరిశ్రమ, ఐటీ నిపుణుల్లో కొంత అలజడి రేగింది. సాఫ్ట్ వేర్, ఔట్ సోర్సింగ్ పరిశ్రమకు కష్టకాలం వచ్చినట్టే అని భావించారు. అయితే, ఊహించినంతగా విపరీత పరిణామాలు ఉండబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ కు ఔట్ సోర్స్ చేస్తున్న ఉద్యోగాలను ఇప్పటికిప్పుడే నియంత్రించడం అంత ఈజీ కాదని వారు చెబుతున్నారు. అమెరికన్లలో నిపుణుల సంఖ్య తక్కువగా ఉందని... మనం చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ ఇప్పటికిప్పుడే వారు చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రచార సమయంలో ఆయన ఏది చెప్పినప్పటికీ... అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనలోని వ్యాపారవేత్త బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి అమెరికాకు భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి. రాజకీయ పరంగా, వాణిజ్య పరంగా ఇరు దేశాల మధ్య బలమైన బంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ దూకుడుగా వ్యవహరించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.