: 'నోట్ల రద్దు' విషయం వారికి మాత్రమే తెలుసు.. అత్యంత రహస్యంగా ఆరు నెలల కసరత్తు తర్వాతే నిర్ణయం!
ఒకేఒక్క మాటతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ఇదీమీ ఆషామాషీగా చేసిన ప్రకటన కాదు. దీని వెనక సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆరు నెలల కృషి ఉంది. ఈ మొత్తం ప్రక్రియను మూడో కంటికి తెలియకుండా చక్కబెట్టారు. అత్యంత విశ్వసనీయ వ్యక్తులను మాత్రమే ఇందుకోసం ఎంచుకున్నారు. ప్రకటన వెలువడే వరకు వారికి తప్ప మరెవరికీ ఈ విషయం తెలియదు. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్ ఆరు నెలల క్రితం ప్రారంభమైంది. అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌తో మోదీ సమావేశమై నల్లధనం నియంత్రణపై చర్చించారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని నిర్ణయించారు. రూ.50, రూ.100 నోట్లు ఎక్కువగా ముద్రించాలని సూచించారు. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి వరకు ఆ విషయం ప్రధాని మోదీ, గవర్నర్ రఘురామ్ రాజన్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాలకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆర్థిక శాఖ అధికారుల సహకారం కావాల్సి రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి వివరించింది. దీంతో ఆయన అత్యంత విశ్వసనీయులైన ఇద్దరు సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అంతే.. వారికి తప్ప మరెవరికీ విషయం తెలియదు. సరిగ్గా మూడు నెలల క్రితం రూ.2 వేల నోటు ముద్రించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో రూ.500 నోట్లు ముద్రించాలని అనుకున్నారు. ఈ నోట్ల డిజైన్లకు సంబంధించి ఆర్బీఐ పలుమార్లు ప్రధానిని కలిసింది. ఈ సమావేశంలో జైట్లీ కూడా పాల్గొన్నారు. డిజైన్ ఖరారైంది. వెంటనే రూ.2 వేల నోటు ముద్రించాలని ప్రధాని ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ముద్రించారని సమాచారం. గత గురువారం అన్ని రాష్ట్రాల ఆర్బీఐ డైరెక్టర్లతో జైట్లీ సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై అభిప్రాయం కోరారు. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో సమావేశ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరారు. శుక్రవారం సాయంత్రం మోదీ, జైట్లీ సమావేశమయ్యారు. రద్దు నిర్ణయం ప్రభావాన్ని చర్చించేందుకు ఆర్థికశాఖ అధికారులతోనూ సమావేశమయ్యారు. వంద నోట్లను ఏటీఎంలకు పంపించవద్దని, పెద్ద నోట్లను మాత్రమే పంపించాలని ఆర్బీఐకి ఆర్థికశాఖ సమాచారం ఇచ్చింది. బుధవారం నుంచి రూ.1000, రూ.500 నోట్లు తీసుకోవద్దంటూ మంగళవారం ఉదయమే ఆర్బీఐకి ఆదేశాలు అందాయి. ఇక చివరిగా మంగళవారం సాయంత్రం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఫ్యాక్స్ వచ్చింది. అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు చెల్లవని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ సమాచారం ఇచ్చారు. మొత్తం ప్రణాళిక పూర్తయ్యాక చివరిగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రిజర్వ్ బ్యాంకు బోర్డు భేటీ అయింది. రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సాయంత్రం ఆరున్నర గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. అక్కడే సహచర మంత్రులకు జైట్లీ రద్దు విషయాన్ని చెప్పారు. సాయంత్రం 8 గంటలకు మోదీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.