: ట్రంప్ గెలుపు భయం పుట్టిస్తోంది: హాలీవుడ్ నటులు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో హాలీవుడ్ నటులు ఇబ్బందుల్లో పడ్డారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ సరైన వ్యక్తి కాదని, హిల్లరీకే తమ మద్దతని మెజారిటీ హాలీవుడ్ సభ్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయం వారిలో అసహనం కలిగిస్తోంది. ఖేర్, క్రిస్ ఇవాన్స్ వంటి నటులు ట్రంప్ విజయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు నటులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. క్రిస్ ఇవాన్స్ తన ట్విట్టర్ ద్వారా 'ఇది అమెరికాకు చాలా కలవరాన్ని పుట్టించిన రాత్రి' అన్నాడు. విద్వేషాలను ప్రోత్సహించే ఓ వ్యక్తికి తమ గొప్ప దేశాన్ని అప్పగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. జెస్సీ టైలర్ ఫెర్గూసన్ అనే మరోనటుడు 'ముస్లింలు, మహిళలు, వలసదారులు, ఎల్జీబీటీ కమ్యునిటీ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నా'నని పేర్కొన్నాడు. అయితే, భవిష్యత్తులో వారి తరుపున పోరాడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ఖెర్ అనే మ్యూజీషియన్ 'ట్రంప్ ఈ విజయాన్ని ఎలా సాధించాడు? అతడిని జైలులో వేసి తాళం పడేయాలి. అమెరికాలో ఈ రాత్రిని మించిన హాస్యం మరొకటి లేదు' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వారితో పాటు పలువురు హాలీవుడ్ నటులు ట్రంప్ విజయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్ గెలిస్తే దేశం విడిచి వెళ్తామని పలువురు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారంతా ఏం చేస్తారని ట్రంప్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News