: ట్రంప్ విజయం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా చూస్తే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం, జాతీయంగా చూస్తే.. పెద్దనోట్ల రద్దు ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొట్టొచ్చినట్లు కన్పించింది. ఈరోజు ఉదయం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, ముగిసే సమయానికి నష్టాల బాటలోనే కొనసాగాయి. అయితే, ఈరోజు మధ్యాహ్నానికి దేశీయ స్టాక్ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నప్పటికీ, ట్రంప్ విజయం సాధించడం, మదుపరుల్లో నెలకొన్న భయాందోళనల కారణంగా నష్టాల్లోనే కొనసాగాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 338.61 పాయింట్లు నష్టపోయి 27,252.53 వద్ద, నిఫ్టీ 111.55 పాయింట్లు నష్టపోయి 8,432 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్ ఎస్టేట్ సహా అన్నిరంగాల షేర్లు నష్టాల బాటపట్టాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, గెయిల్, ఎస్ బీఐ, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా, మారుతి సుజుకి, టీసీఎస్, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా తదితర సంస్థల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.