: 500, 1000 నోట్ల రద్దు ఎంత పని చేసింది?...డైలమాలో శుక్రవారం విడుదల సినిమాలు
500, 1000 రూపాయల నోట్ల రద్దు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, భోజ్ పురీ, పంజాబీ, బంగాళీ, మరాఠా సినీ పరిశ్రమలపై బలంగా పడింది. సాధారణంగా సినిమాలన్నీ గురు, శుక్రవారాల్లో విడుదలవుతుంటాయి. ప్రపంచంలోని అత్యధిక స్థాయిలో సినిమాలు రూపొందించే భారత్ లో సినీరంగం ప్రముఖ వ్యాపారంగా సత్తాచాటుతోంది. గత రాత్రి ప్రధాని 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో అవసరాలకు సరిపడా వందరూపాయల నోట్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గురు, శుక్రవారాలు వచ్చేస్తున్నాయి. 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం', 'సాహసం శ్వాసగా సాగిపో', 'రాక్ ఆన్ 2', 'తుమ్ బిన్ 2', 'ఫోర్స్ 2' వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్ ధియేటర్లు పెరిగిపోవడంతో టికెట్ల రేట్లు కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. ఈ దశలో చేతిలో డబ్బులు లేక ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేందుకు మొగ్గుచూపే అవకాశం లేదు. దీంతో వారం రోజుల వ్యాపార సూత్రంతో విడుదల కానున్న ఈ సినిమాల భవిష్యత్ పై నిర్మాతలకు బెంగపట్టుకుంది.