: ట్రంప్ గెలుపుతో పుతిన్ ఫుల్ ఖుష్... భిన్న ధృవాలు దగ్గరవుతాయా?


అమెరికా, రష్యాలు చిరకాల శత్రువులన్న సంగతి అందరికీ తెలిసిందే. సోవియట్ యూనియన్ విచ్చిన్నంతో రష్యా ప్రతిష్ఠ మసకబారినా పట్టుదలతో పుంజుకుని మళ్లీ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను రష్యా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో అమెరికాలో కూడా తనకు అనుకూలమైన నాయకత్వం ఉంటే అంతర్జాతీయ సమాజంలో మరింత వేగంగా దూసుకుపోవచ్చని రష్యా అధక్షుడు పుతిన్ భావిస్తున్నారు. ఈ దశలో అమెరికా ఎన్నికలను ఆయన పావుగా వినియోగించుకున్నారు. తాజాగా ఎన్నికల్లో తనను అభిమానించే, తమ దేశంతో సంబంధాలు కలిగిన వ్యక్తితో అనుబంధమున్న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడగానే తన ప్రణాళిక అమలు చేశారు. ఇటీవల టర్కీ, ఉక్రెయిన్ వంటి పొరుగు దేశాల సరిహద్దుల వద్ద భారీ బలగాలను మోహరించి, విదేశాల్లో ఉన్న రష్యన్లను తక్షణం స్వదేశానికి రావాలని, ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని పుతిన్ ప్రకటన జారీ చేశారు. కేవలం భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మినహా ప్రపంచ దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో పుతిన్ ప్రకటన ఎవరికీ అర్థం కానప్పటికీ, చైనాపై అనుమానంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉంచితే, ఇదే సమయంలో ఐఎస్ఐఎస్, లష్కరేతోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రసంస్థల భయంతో ఉన్న అమెరికన్లు మరింత భయపడ్డారు. ఈ సమయంలో ట్రంప్ వారికి రక్షకుడిలా కనిపించారు. అభ్యంతరకర, అవినీతి ఆరోపణలు, పుతిన్ తో సంబంధాలు.. ఇలా ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా ఆయనపైనే అమెరికన్లు విశ్వాసం ప్రకటించారు. దీంతో ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన రష్యాతో సంబంధ బాంధవ్యాలను ఏ దిశగా నడిపిస్తారనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. మరోవైపు ట్రంప్ విజయంతో పుతిన్ కూడా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మైండ్ సెట్ లను పరిశీలించి చూస్తే, వీరి మనస్తత్వాలు కలుస్తాయా? అనే అనుమానం కూడా కొందరిలో నెలకొంది. అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో ట్రంప్ విజయం సాధించగా, పుతిన్ నరనరాన రష్యాను ఆల్వేస్ గ్రేట్ చేయాలనే ఆలోచన నిండిన వ్యక్తి. దీంతో దేశాధినేతలుగా ఈ ఇద్దరూ తమతమ దేశప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో వీరి బంధం బలపడుతుందా? లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో నెంబర్ వన్ రేసులో ఈ రెండు దేశాల కామన్ శత్రువు చైనా అనేది నిర్వివాదాంశం. ఆసియాలోని చిన్న దేశాల్లో పెట్టుబడుల పేరిట పాగావేసి, తన ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు చెక్ చెప్పే విషయంతో పాటు, వ్యూహాత్మక అంశాల్లో ఈ రెండు దేశాధినేతల వైఖరి ఎలా ఉంటుందన్న దానిని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

  • Loading...

More Telugu News