: హిల్లరీ క్లింటన్ ఓటమికి, ట్రంప్ విజయానికి కారణాలు ఇవేనా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనే అంశంపై అంచనాలు వేస్తూ చర్చలు జరిపిన విశ్లేషకులు ఇప్పుడు ట్రంప్ చేతిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి చవిచూడడానికి గల కారణాల గురించి చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిల్లరీ, ట్రంప్‌ల మధ్య ప్రచారం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ తన ప్రచారంలో 85 నినాదాలు వినిపిస్తూ ముందుకు సాగారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం సెపరేటు రూటులో వెళ్లారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ఒకే ఒక్క నినాదాన్ని చేస్తూ తన ప్రచారం కొనసాగించారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ అమెరికన్లలో జాతీయ భావం నిండేలా ప్రచారం చేసుకున్నారు. ప్రపంచాన్ని పీడిస్తోన్న ఉగ్రవాదంపై మండిపడుతూ దాన్ని అంతమొందించే శక్తి తనకు ఉందని ఒప్పించడంలో ట్రంప్ విజయం సాధించారు. మరోవైపు హిల్లరీ క్లింటన్ మాత్రం ఈ అంశాలపై వెనకపడిపోయారు. అనేక విషయాల్లో ఆమెరికన్లకు భరోసా ఇవ్వలేకపోయి చివరికి ఓటమిని చవిచూశారు. ఉగ్రవాదంపై ట్రంప్ స్థాయిలో హిల్లరీ క్లింటన్ మాట్లాడలేకపోయారు. మరోవైపు ట్రంప్‌కి అమెరికాలోని నిరుద్యోగులు, నిరక్షరాస్యులు మద్దతుగా నిలిచారు. అందుకే బాగా చదువుకున్నవారంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనాలని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కొన్నిరోజుల క్రితం వ్యాఖ్యానించారు.