: ‘చిల్లర కావలెను’ ప్లీజ్... దేశ వ్యాప్తంగా ప్రజల చిల్లర కష్టాలు.. 10శాతం కమీషన్ అడుగుతున్న దళారులు!
నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి వ్యాపారులందరూ నిరాకరిస్తుండడంతో చిల్లర డబ్బులు కావాలంటూ ప్రజలు తిరుగుతున్నారు. ప్రజల ఇబ్బందిని పసిగట్టిన దళారులు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లపై 10 శాతం కమీషన్ తీసుకుని చిల్లర అందిస్తున్నారు. ఈ రోజు ఏటీఎంలు, బ్యాంకులు వినియోగదారులకి అందుబాటులో లేవన్న విషయం తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి వంద, యాభై రూపాయల నోట్లు తీసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. చిల్లరలేకపోవడంతో షాపింగ్ చేయలేకపోతున్నారు. మెడికల్ షాప్‌లు, రైల్ టిక్కెట్లు వంటి చోట్ల మాత్రమే పెద్ద నోట్లను స్వీకరిస్తున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రజలు తమ పెద్ద నోట్లని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నల్లధనం తప్ప, సక్రమంగా డబ్బు సంపాదించి దాచి పెట్టుకున్న వారికి డిపాజిట్‌పై పరిమితి లేదని బ్యాంకర్లు తెలుపుతున్నారు. ప్రజలు తమ పెద్ద నోట్ల చలామణిపై ఆందోళన చెందే అనవసరం లేదని సూచిస్తున్నారు.