: ట్రంప్ విజయాన్ని ఏమాత్రమూ తట్టుకోలేకపోతున్న వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి వర్గాలు
రిపబ్లికన్ల తరఫున అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడి ఎవరూ ఊహించని అనూహ్య రీతిలో శ్వేతసౌధానికి చేరువవుతున్న డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి వర్గాలు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకున్నాయి. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత, ట్రంప్ విజయావకాశాలు పెరుగుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 909 పాయింట్లు పడిపోయి 5.59 శాతం నష్టంతో 16,262 పాయింట్లకు దిగజారింది. స్ట్రెయిట్స్ టైమ్స్ 1.81 శాతం నష్టంతో 2,770 పాయింట్లకు, హ్యాంగ్ సెంగ్ 2.85 శాతం నష్టంతో 22,274 పాయింట్లకు, తైవాన్ సూచిక 3.07 శాతం నష్టంతో 8,943 పాయింట్లకు, కోస్పీ 2.92 శాతం నష్టంతో 1,946 పాయింట్లకు, షాంగై కాంపోజిట్ అర శాతం నష్టంతో 3,132 పాయింట్లకు పడిపోయాయి. కీలకమైన అమెరికా మార్కెట్లో డౌ జోన్ ఫ్యూచర్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 2.92 శాతం నష్టపోయి 17,690 పాయింట్ల వద్ద ఉంది. ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ ఏకంగా 4.05 శాతం దిగజారి 2,045 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. మార్కెట్ ప్రారంభమైతే, ఈ నష్టం మరింతగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మంగళవారం నాటి సెషన్ లో అర శాతం వరకూ లాభపడ్డ యూరప్ మార్కెట్ నేడు 3 నుంచి 4 శాతం వరకూ నష్టపోవచ్చని భావిస్తున్నారు.