: ‘అమెరికన్స్ కౌంటింగ్ వోట్స్... ఇండియన్స్ కౌంటింగ్ నోట్స్’ ట్విట్టర్‌లో నెటిజన్ల నినాదం ఇదే!
అమెరికాలో ఉద్యోగాలు చేస్తోన్న భారతీయులు అధికంగానే ఉన్నారు. కొన్ని రోజులుగా అమెరికా ఎన్నికల గురించి భారతీయులు విపరీతంగానే చర్చించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలని కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు పూజలు కూడా చేయడం కనపడింది. మరి కొందరు భారతీయులు హిల్లరీ క్లింటనే గెలవాలని, అప్పుడే అమెరికాలో భారతీయ ఉద్యోగులకు రక్ష అని భావిస్తున్నారు. సరిగ్గా అమెరికా ఎన్నికలు జరుగుతోన్న సమయంలో భారత్‌లో నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్ల రద్దు అంటూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఈ రెండు విషయాలే హాట్ టాపిక్. రెండు అంశాలను పోల్చుతూ, రెండింటిపై సెటైర్లు వేస్తూ, మెచ్చుకుంటూ నెటిజన్లు ట్రెండుకు తగ్గ ఎంజాయ్ చేస్తున్నారు. ‘అమెరికన్స్ కౌంటింగ్ వోట్స్... ఇండియన్స్ కౌంటింగ్ నోట్స్’ అనే నినాదంతో ట్విట్టర్‌లో యాష్ ఇండియన్ నోట్స్ (#indian notes) ట్యాగ్‌ను సృష్టించిన భారతీయులు వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. అమెరికాలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంటే ఇండియాలో నోట్ల మార్పిడి ఉత్కంఠ నెలకొందని పేర్కొంటున్నారు. కొందరు ఇప్పటికే భారతీయుల బ్లాక్ మనీ అమెరికన్ డాలర్ల రూపంలో సురక్షితంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, నకిలీ నోట్లకు మాత్రం ఇక ఇండియాలో చెల్లు అని అంటున్నారు. నల్లకుబేరుల్లో వణుకు పుడుతోందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తోంటే... పేదలకు న్యాయం జరుగుతోందని మరికొందరు పేర్కొంటున్నారు. అమెరికాలో ఎన్నికల ఫైట్.. ఇండియాలో బ్లాక్ మనీపై ఫైట్ అని పలువురు పేర్కొంటున్నారు. తమ తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలోనూ భారతీయులు అమెరికా, ఇండియాలో జరుగుతున్న పరిణామాలపైనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గెలిస్తే రాత్రికి రాత్రి భారతీయ ఉద్యోగులు ఇండియాకి వచ్చేయాలేమో?నని కొందరు పేర్కొంటుంటే, ఐఎస్ఐఎస్ కు మూడిందని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.