: మోదీపై మొదలైన విమర్శలు.. నోట్ల రద్దుపై విరుచుకుపడుతున్న విపక్షాలు
దేశంలో నల్లధనం నిర్మూలనకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని మంత్రి చర్యను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పు పట్టారు. ఈ కఠిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పాశవిక చర్యకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయంతో పేదలు చాలా ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం, అవినీతికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనలో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామన్న కేంద్రం ప్రకటనను ఆయన ఖండించారు. మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని మోదీని తుగ్లక్ ఆత్మ ఆవహించిందని తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.