: నేటి అర్ధరాత్రి నుంచి 500, 1000 నోట్లు రద్దు: మోదీ సంచలన ప్రకటన
నేటి అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. బ్లాక్ మనీని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 500 రూపాయలు నోట్లు, 1000 రూపాయల నోట్లు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో మార్చుకోవచ్చని ఆయన సూచించారు. అలాగే నగదు డ్రాపై వారానికి గరిష్ఠంగా 20 వేల రూపాయల పరిమితిని విధిస్తున్నట్టు తెలిపారు. రోజుకు గరిష్ఠంగా పది వేల రూపాయల విత్ డ్రాను మాత్రమే అనుమతించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. అలాగే 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బ్లాక్ మనీ నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా 2000 నోట్లను వాడుకలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. నవంబర్ 12 వరకు 500 లేదా 1000 రూపాయల నోట్లు మందుల షాపులు, రైల్వే, బస్, విమాన టికెట్ కౌంటర్లు వంటి ప్రాంతాల్లో మాత్రమే చెల్లుతాయని ఆయన స్పష్టం చేశారు.