: గిరిజనుడి హత్య కేసులో ఢిల్లీ ప్రొఫెసర్ నందినీ సుందర్ పై కేసు నమోదు
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ తన పేరుకు బదులుగా వేరే పేరుతో ఇటీవల బస్తర్ లో తిరిగారని, ఆమెపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు అంటున్నారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ ఎస్ఆర్ పీ కల్లూరి మాట్లాడుతూ, ఈ ఏడాది మేలో మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో పర్యటించేందుకు ఒక బృందాన్ని పంపారని, ఆ బృందంలో ఢిల్లీ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నందిని సుందర్ కూడా ఉన్నారన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఆమెను ప్రశ్నించగా తన అసలు పేరుకు బదులు వేరే పేరు చెప్పిందని, ఆమెతో పాటు వచ్చిన బృందం కూడా అడవిలో తిరిగారని, వారు కూడా తప్పుడు పేర్లతో అక్కడి హోటళ్లలో, రెస్ట్ హౌస్ లో విడిది చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, గత వారం సుక్మా జిల్లాలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారని, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నందిని సుందర్, మరికొందరిపై మర్డర్ కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నందినీ సుందర్ ఖండించారు. పోలీసుల అరాచకాలను బయటపెడుతున్న రీసెర్చి స్కాలర్లు, జర్నలిస్టులు, లాయర్లు, యాక్టివిస్ట్ లపై వారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.