: ట్రంప్ గెంటేసిన బాలుడిపై ఒబామా ప్రేమ కురిపించారు!
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ బయటకు గెంటేసిన బాలుడిని యూఎస్ అధ్యక్షుడు ఒబామా ఆహ్వానించారు.. ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపాలో మూడు రోజుల క్రితం అంటే శనివారం నాడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. వికలాంగుల పట్ల ట్రంప్ ప్రవర్తనకు నిరసన తెలపాలని సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతూ, వీల్ చైర్ కే పరిమితమయిన పన్నెండు సంవత్సరాల బాలుడు జేజే హోమ్స్ భావించాడు. ఈ క్రమంలో తన తల్లి అలిసన్ ను అక్కడికి తీసుకువెళ్లమని కోరడంతో ‘సరే’ అని చెప్పింది. ట్రంప్ ప్రచార సభకు వెళ్లిన జేజే, అలిసన్ లు డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్లకార్డులను చేత బూనారు. ఆమెకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు ఆ ప్రచార సభకు హాజరైన వారి సమాచారం. దీంతో, వెంటనే స్పందించిన ట్రంప్, అక్కడి నుంచి జేజేని, ఆమె తల్లిని తక్షణం బయటకు పంపించాలంటూ ఆదేశించడంతో, ట్రంప్ మద్దతుదారులు రంగంలోకి దిగారు. జేజే వీల్ చైర్ ను పక్కకు తోసేశారని తల్లి అలిసన్ ‘వాషింగ్టన్ పోస్ట్’కు తెలిపింది. మమ్మల్ని బయటకు నెట్టేయమని ట్రంప్ చెప్పడంతో, అక్కడి సెక్యూరిటీ వాళ్లు ఆ పని చేశారని ఆమె ఆరోపించింది. కంప్యూటర్ ఓకలైజేషన్ పరికరం ద్వారా జేజే మాట్లాడుతూ, ‘ఐ హేట్ డొనాల్డ్ ట్రంప్’ అని అన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉంటే, ఈ చేదు అనుభవంతో వెనుదిరిగిన జేజే, అతని తల్లికి.. ఇరవై నాలుగు గంటల లోపే అమెరికా అధ్యక్షుడు ఒబామా వారిని ప్రేమపూర్వకంగా పలుకరించారు. ఆ మర్నాడు హిల్లరీ ప్రచార సభకు ఈ తల్లీ కొడుకులిద్దరూ వెళ్లారు. అక్కడున్న ఒబామా జేజేను ప్రేమగా ఆహ్వానించి దగ్గరకు తీసుకున్నాడు. దీంతో, జేజే ముఖంలో నవ్వులు విరిశాయి.