: అమెరికా ప్రెసిడెంట్ రాజ భోగాలివి!
అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆ పీఠానికి ఎందుకు అంత ప్రత్యేకత? అంటే... ప్రపంచ పెద్దన్నగా నీరాజనాలు అందుకుంటున్న అమెరికాకు ప్రెసిడెంట్ కావడం కంటే గొప్ప పదవేదీ లేదన్న సంగతి అందరూ అంగీకరించేదే. అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ గా పొందే సౌకర్యాలు కూడా అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అమెరికా ప్రెసిడెంట్ వార్షిక వేతనం 4,00,000 డాలర్లు (2 కోట్ల 66 లక్షల 84 వేల 180 రూపాయలు) అందుకుంటారు. అంటే నెలకు దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలకు పైగా వేతనమన్నమాట. దానితోపాటు 50 వేల డాలర్లు (33 లక్షల 35 వేల 522 రూపాయలు) వార్షిక వ్యయ ఖర్చులు, అదనంగా ప్రయాణాలకు 1,00,000 డాలర్లు (66 లక్షల 71 వేల 245 రూపాయలు) అందుతాయి. ప్రెసిడెంట్ వినోదానికి 19,000 డాలర్ల (12 లక్షల 67 వేల 498 రూపాయలను)ను చెల్లిస్తారు. అంతే కాకుండా 18 ఎకరాల గ్రీన్ గ్రౌండ్ లేదా ప్రైవేట్ పూల్ ను ప్రెసిడెంట్ కోసం ఏర్పాటు చేశారు. 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాల శ్వేతసౌధంలో 132 గదులుంటాయని సమాచారం. ఆ గదులన్నీ ఎల్లప్పుడూ తాజా పూల సువాసనలు వెదజల్లేలా తీర్చిదిద్దుతారు. ప్రెసిడెంట్ నిర్వహించే కార్యక్రమాల వ్యయాల రూపంలో ఏడాదికి 2,50,000 డాలర్ల పైనే ఖర్చు అవుతుందని సమాచారం. ఏడాదికి వైట్ హౌస్ వ్యయం 4 మిలియన్ డాలర్ల పైనే ఉంటుంది. ప్రెసిడెంట్ వినియోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో సూపర్ లగ్జోరియస్ ఆఫీస్, కాన్ఫరెన్స్ రూం, బాత్ రూం, జిమ్, బెడ్ రూం వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి. ఈ విమానం ఒకసారి గాల్లోకి లేచి, గంటసేపు చక్కర్లు కొడితే 2,10,877 డాలర్లు ఖర్చవుతుంది. అలాగే ప్రెసిడెంట్ ఏర్పాటు చేసే విందుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్థాయికి తగ్గట్టు, అతిథి అభిరుచులు, అధ్యక్షుడి అభిరుచుల మేళవింపుగా నిపుణులైన చెఫ్ లే తీర్చిదిద్దుతారు. వైట్ హౌస్ లోని గ్రౌండ్ లోని తేనెటీగల నుంచి సేకరించిన తేనెను మాత్రమే ప్రెసిడెంట్ వంటకాల్లో వినియోగిస్తారు. చెక్కతో నిర్మించబడిన ఈ ఇళ్లు, స్పా, స్విమ్మింగ్ పూల్, బౌలింగ్ అల్లే, స్కీట్ షూటింగ్ రేంజ్, టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్ కోర్సు, గుర్రం స్టేబుల్స్, ఐస్ స్కేటింగ్ రింక్ ల వంటి సౌకర్యాలన్నీ ప్రెసిడెంట్ కి అందుబాటులో ఉంటాయి. అలాగే పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా 2,00,000 డాలర్ల పెన్షన్ సౌకర్యం ఏడాదిపాటు ఉంటుంది. ఉచిత ఆరోగ్య సదుపాయాలు, కార్యాలయ ఖర్చులతో ట్రావెల్, జీవితకాల సీక్రెట్ సర్వీసు ప్రొటెక్షన్, ఇంకా తమకు నచ్చిన స్టాఫ్ను నియమించుకునేందుకు 96,000 డాలర్లను కూడా వారు పొందుతారు. అంతే కాకుండా ఇంకా ఎన్నో సౌకర్యాలు అదనంగా అందుతాయని తెలుస్తోంది.