: ఏపీ సీఎం డ్యాష్ బోర్డు సూపర్ అంటున్న నీతి ఆయోగ్ బృందం
ఏపీ సీఎం డ్యాష్ బోర్డు అద్భుతంగా ఉందని, దీనిని చూసి తామెంతో నేర్చుకున్నామని నీతి ఆయోగ్ బృందం చంద్రబాబును ప్రశంసించింది. విజయవాడ పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా మర్యాదపూర్వకంగా ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఏపీలో అమలు చేస్తున్న డిజిటల్ జియో ట్యాగింగ్ ను వారికి వివరించారు. ఇప్పటికే అన్ని శాఖలను డిజిటలైజ్ చేశామని చెబుతూ, డ్యాష్ బోర్డు వినియోగిస్తున్న విధానాన్ని నీతిఆయోగ్ బృందానికి చంద్రబాబు వివరించారు. ఉత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ‘నీతిఆయోగ్’ను చంద్రబాబు కోరారు. కాగా, తూర్పు తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కోస్టల్ ఎకనామిక్ జోన్ కు ఏపీ రాష్ట్రమే ప్రధాన కేంద్రం కానుంది. ఈ జోన్ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉండటంతో, దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పనగారియా, చంద్రబాబుతో ఒక కీలక సమావేశం నిర్వహించే నిమిత్తం విజయవాడ వచ్చారు. సింగపూర్, మలేషియా దేశాలకు దగ్గరగా ఉండటం, పొడవైన సముద్ర తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ కీలక ప్రాంతం కానుంది. ఈ జోన్ ను ఒడిశా నుంచి ఏపీ వరకు లేదా ఏపీ నుంచి చెన్నై వరకు ఏర్పాటు చేసినా ఏపీ భాగస్వామ్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే నీతిఆయోగ్ బృందం చంద్రబాబుతో సమావేశం నిర్వహించేందుకు వచ్చింది.