: మసూద్ అజర్ పై ఎంతకాలమిలా? ఐరాసలో విరుచుకుపడ్డ ఇండియా!
జైషే మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితి కావాలనే తాత్సారం చేస్తోందని భారత్ మండిపడింది. జైషే మొహమ్మద్ సంస్థను నిషేధించిన ఐరాస, మసూద్ అజర్ ను ఎందుకు ఉపేక్షిస్తోందని, ఇంకా ఎంతకాలం ఇలా సాగదీస్తారని ప్రశ్నించింది. గతంలో రెండుసార్లు మసూద్ ఉగ్రవాదని ప్రకటించే వేళ, చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం రెండుసార్లు తమ దేశంపై మసూద్ ఉగ్రదాడులు జరిపించాడని, వీటి కారణంగా 26 మంది సైనికులు మరణించారని ఐరాస వేదికపై భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో విఫలమవుతున్నామన్న బాధను వ్యక్తం చేస్తూ, ఇలాంటి పరిస్థితి కూడదని, నిత్యమూ ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారని గుర్తు చేశారు. మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు 9 నెలల సమయం తీసుకుని కూడా నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.