: జయలలిత అన్ని అవయవాలూ సాధారణ స్థితికి... అతి త్వరలో డిశ్చార్జ్
దాదాపు నెలన్నరకు పైగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్ని అవయవాలూ సాధారణ స్థితికి చేరుకున్నాయని, మరో 15 రోజుల్లోపే ఆమె డిశ్చార్జ్ కానున్నారని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి పొన్నియన్ వ్యాఖ్యానించారు. ఆమెను సీసీయూ నుంచి సాధారణ గదిలోకి మార్చే విషయంలో డాక్టర్లదే నిర్ణయమని, ప్రతి ఒక్కరూ ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. పార్టీ నేతలు సైతం ఆమె మరిన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటేనే మంచిదని భావిస్తున్నారని, తొందరపడి ఇంటికి వస్తే, మరోసారి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదమున్నందున బయట వాతావరణంలోకి సాధ్యమైనంత ఆలస్యంగా వస్తేనే మంచిదని భావిస్తున్నట్టు పొన్నియన్ వెల్లడించారు. ఇంటికి వస్తే, ఆమె విశ్రాంతిగా కూర్చోబోరని వ్యాఖ్యానించిన ఆయన, సీసీయూలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆడియో వ్యవస్థ ద్వారా చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారని తెలిపారు.