: శునకాల కోసం బోనులో కూర్చుంటానంటున్న కమెడియన్.. ఫేస్బుక్ లో లైవ్ అప్ డేట్లు సైతం ఇస్తాడట!
జంతు ప్రేమికులు వాటిని రక్షించడానికి అనేక పోరాటాలు చేయడం చూస్తూనే ఉంటాం. మూగ జీవాలకు ఉండే హక్కులను విస్మరించకూడదని, వాటిని కాపాడుకోవాలని వారు ప్రదర్శనలు నిర్వహిస్తూ తెలియజేస్తున్నప్పటికీ ఎన్నో చోట్ల మనుషులు మూగజీవులను హింసించే ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. జంతు ప్రేమికులకు వాటిపై ఉండే ప్రేమ వారిని ఎంత దూరమైనా తీసుకెళుతోంది. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కమెడియన్ రెమి గెయిల్లార్డ్ జంతువుల హక్కులను కాపాడాలంటూ, వాటిని రక్షించాలంటూ బోనులో కూర్చోడానికి సిద్ధమయ్యాడు. తనకు సమయం ఉన్నప్పుడల్లా జంతువుల హక్కులను రక్షించాలంటూ ప్రచారం చేసే రెమి గెయిల్లార్డ్ తమ దేశంలోని ఎస్పీఏ మోంట్పిల్లీర్ డాగ్ షెల్టర్‌లో బంధించబడి ఉన్న 300 శునకాలను చూసి చలించిపోయాడు. వాటిని అక్కడి నుంచి విడుదల చేయాలని శునకాలను బంధించిన బోన్లలోనే తనను తాను బంధించుకోనున్నట్లు తెలిపాడు. ఈ నెల 11 నుంచి ఈ పోరాటానికి దిగుతానని షెల్టర్‌లో ఉన్న 300 శునకాలను ఎవరైనా దత్తత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అలాగే, ఆ శునకాల సంరక్షణ కోసం 50వేల యూరోల విరాళాలు కూడా సమర్పించాలని కోరుతున్నాడు. ఈనెల 11 నుంచి తాను బోనులో కూర్చొని తన ఫేస్బుక్ ఖాతా నుంచి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.