: రాత్రి 1:30కు చదువేంటంటూ, అమ్మాయిలపై నిషేధం విధించిన పూణె కాలేజ్... అబ్బాయిలైతే ఓకేనట!


పూణెలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల అమ్మాయిల పట్ల వివక్ష చూపి విమర్శలకు గురవుతోంది. ఇక్కడి లైబ్రరీని 24 గంటలూ తెరిచేవుంచుతారు. పీజీ వైద్య విద్యార్థులు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్ షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకుంటుంటారు. రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. తాజాగా, అమ్మాయిలపై నిషేధం విధిస్తూ, రాత్రి 11:15 గంటలకెల్లా అందరు విద్యార్థినులనూ హాస్టళ్లకు పంపేస్తున్నారు. యూజీసీ నిబంధనల మేరకు ఆడ, మగ తేడా చూపుతూ ఎలాంటి ఉత్తర్వులను ఇచ్చే వీల్లేకున్నా, మహిళల స్వేచ్ఛను హరించేలా కాలేజీ డీన్ అజయ్ చందన్ వాల్ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ లైబ్రరీకి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కూడా చదువు పేరిట అమ్మాయిలు వస్తున్నారని, ఇది వారికి క్షేమం కాదన్న ఉద్దేశంతోనే నిబంధనలు మార్చామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం అమ్మాయిల భద్రత గురించి ఆందోళనతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని చందన్ వాలే చెబుతున్నారు. ఇదిలావుండగా, నెల రోజుల్లో ఆలిండియా పీజీ ప్రవేశపరీక్ష ఉన్నందున, పుస్తకాలు కొనుగోలు చేసే స్తొమతలేని వారు రాత్రుళ్లు వంతుల ప్రకారం లైబ్రరీలో చదువుకుంటున్నారని, ఈ సమయంలో ఆంక్షల వల్ల ర్యాంకులు కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News