: 'డాయిష్' అంటే ఏమిటి?... అలా పిలిస్తే 'ఐఎస్ఐఎస్' ఎందుకు రగిలిపోతుంది?


కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ను ఇకపై డాయిష్ (daesh) అని పిలవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ అని పిలిస్తే దానికి చట్టబద్ధత కల్పించినట్టవుతుందనేది కేంద్రం భావన. ఇప్పటికే ప్రపంచంలోని పలువురు కీలక దేశాధినేతలు ఐఎస్ఐఎస్ ను డాయిష్ అనే పేరుతోనే పిలుస్తున్నారు. 2015 జనవరిలో అప్పటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఇకపై తాను ఐఎస్ఐఎస్ అని పిలవబోనని... డాయిష్ అని సంబోధిస్తానని ప్రకటించారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హొలాండే, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా ఐఎస్ ను డాయిష్ గానే పిలుస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ గతంలో సిరియాలో ప్రసంగిస్తూ, ఐఎస్ఐఎస్ ను పలుమార్లు డాయిష్ గా పిలిచారు. 2015 నవంబర్ లో పారిస్ పై ఉగ్రదాడి జరిగిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా డాయిష్ పదాన్ని వాడటం మరీ ఎక్కువైంది. ఈ పదం గురించి ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా వందల రెట్లు పెరిగింది. అయితే, తమను డాయిష్ అని పిలుస్తుండటం ఐఎస్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆ సంస్థ కోపంతో రగిలిపోతోంది. అంతేకాదు, డాయిష్ అని పిలిచేవారి నాలుకలు కోస్తామంటూ కూడా ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఐఎస్ఐఎస్ కోపానికి ఓ కారణముంది. వాస్తవానికి డాయిష్ (daesh) అనేది ‘అల్-దవియా అల్-ఇస్లామియా ఫె అల్-ఇరాక్ వ అల్-షామ్’(ది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/షామ్) అనే దానికి సంక్షిప్త పదం. కానీ అరబిక్ భాషలో డాయిష్ (daes) అనే పదం కూడా ఉంది. ఈ రెండు పదాలు పలకడానికి ఒకేలా ఉంటాయి. కాలితో దేన్నైనా నలిపి పడేసిన దాన్ని అరబిక్ లో డాయిష్ అంటారు. ఈ నేపథ్యంలో, తమను డాయిష్ అని పిలవడం ద్వారా... తమ స్థాయిని అత్యంత చులకన చేసి చూస్తున్నట్టుగా ఐఎస్ భావిస్తోంది. అందుకే, తమను అలా పిలిచే వారి నాలుకలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయితే, ఐఎస్ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ దుర్మార్గపు ఉగ్ర సంస్థను డాయిష్ అని పిలవడమే కరెక్ట్ అని పలువురు ప్రపంచ అగ్ర నేతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News