: విమానంలో విషసర్పం... ప్రయాణికులు షాక్!
అచ్చం 'స్నేక్ ఆన్ ఏ ప్లేన్' హాలీవుడ్ సినిమా తరహాలోనే ఈ ఘటన జరిగింది. మెక్సికోకు చెందిన ఓ ప్రైవేట్ విమానం టొర్రెన్ నగరం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి, లగేజ్ కంపార్ట్ మెంట్ వద్ద ఓ వ్యక్తికి దాదాపు మూడు మీటర్ల పొడవైన విషసర్పం కనిపించింది. దీంతో, ఒక్కసారిగా అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే తేరుకుని ఆ దృశ్యాన్ని తన మొబైల్ లో బంధించాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇతర ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అనంతరం, కొంచెం ధైర్యం తెచ్చుకుని, క్యాబిన్ నుంచి ఆ పాము కిందకు జారకుండా, అది కిందకు పడే ప్రదేశాన్ని బ్లాంకెట్లతో మూసివేశారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్లకు తెలియజేశారు. అయితే, విమానం చేరాల్సిన గమ్యస్థానం దగ్గర్లోనే ఉందని ప్రయాణికులకు ధైర్యం చెప్పిన పైలట్లు, పది నిమిషాల తర్వాత విమానాన్ని మెక్సికోలో ల్యాండ్ చేశారు. ఆ తర్వాత, యానిమల్ కంట్రోల్ వర్కర్లు వచ్చి పామును పట్టుకున్నారు. అయితే, విమానంలోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతామని ఏరో మెక్సికో సంస్థ ప్రకటించింది.