: మద్యం ట్రక్కు బోల్తా... పండుగ చేసుకున్న మందుబాబులు!
హర్యాణాలోని ఝజ్జర్ ప్రాంతం నుంచి ఢిల్లీకి ఫుల్ లోడ్ తో వచ్చిన ఓ మద్యం ట్రక్కు తిరగబడిపోయింది. దీంతో, అందులోని స్టాక్ అంతా రోడ్డు మీద చిందరవందరగా పడిపోయింది. అంతే, చుట్టుపక్కలున్న వారి కళ్లలో ఒక్కసారిగా మెరుపు కనిపించింది. దొరికిన కాడికి దొరికినంత అనుకుంటూ, రెండు చేతులతో మందు బాటిల్స్ పట్టుకుపోయారు మందుబాబులు. చలిని తట్టుకోవడానికి జాకెట్లు, స్వెట్టర్లు వేసుకున్న వారయితే పండగ చేసుకున్నారు. వాటిని విప్పేసి... అందులో లిక్కర్ బాటిల్స్ ను ప్యాక్ చేసుకుని వెళ్లిపోయారు. పక్కనే ఉన్న కాలనీవాసులైతే ఏకంగా సంచుల్లో నింపుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో, కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం స్టాక్ మాయమైపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని చిరాగ్ ఫ్లైఓవర్ ప్రాంతంలో జరిగింది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొని ట్రక్కు పల్టీ కొట్టింది. కిందపడ్డ సరుకును జాగ్రత్తగా కాపాడాల్సిన డ్రైవర్... అక్కడ నుంచి పరారయ్యాడు. హర్యాణాలోనే అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా ఢిల్లీకి తరలించారని... అందుకే డ్రైవర్ పరారయ్యాడని భావిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు ఈ ఖరీదైన మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.