: ప్రియుడిని పోలీస్ స్టేషన్లో పెట్టారని ప్రియురాలి ఆత్మహత్య.. ఖమ్మం జిల్లాలో విషాదం


తన ప్రేమను అంగీకరించకపోవడమే కాకుండా ప్రియుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మండలం బయ్యారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిలకబత్తిన జ్యోత్స్న(17) మధిరలో ఇంటర్మీడియట్ చదువుతోంది. దేశినేనిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజు(23)ను ప్రేమించింది. కొంతకాలం క్రితం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో రాజు తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ జ్యోత్స్న తండ్రి కేసు పెట్టాడు. హైదరాబాద్‌లో ఉన్న రాజు, జ్యోత్స్నలను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జ్యోత్స్న మైనర్ కావడంతో మేజర్ అయ్యాక వివాహం చేసుకోవచ్చని కౌన్సెలింగ్ చేసి పంపించారు. రాజును మాత్రం జైలుకు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోత్స్న సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News