: పానీ పూరీ తింటున్నారా? కాస్త ఆగండి.. అందులో బ్యాక్టీరియా ఫుల్.. ‘గాంధీ’ అధ్యయనంలో వెల్లడి


రోడ్డు పక్కన బండిపై కనిపించే పానీ పూరీ అంటే ఇష్టపడని వారుంటారా? లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం ఇక నుంచి అటువైపు కన్నెత్తి కూడా చూడరు. పానీపూరీపై హైదరాబాదు, గాంధీ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్(సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్) నిర్వహించిన అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు బయటకొచ్చాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పానీపూరీల నమూనాలపై వైద్య విద్యార్థులు ల్యాబ్‌లో పరీక్షించారు. నాలాలకు రెండు మీటర్ల దూరంలో ఉన్న పానీపూరీ బళ్ల నుంచి సేకరించిన పానీపూరీ, ఇతర ఆహారం 48.2 శాతం కలుషితమైనట్టు గుర్తించారు. రెండు మీటర్లకు పైబడి ఉన్న దుకాణాల నుంచి సేకరించిన వాటిలో 28.6 శాతం వరకు బ్యాక్టీరియా కలుషితాలు ఉన్నట్టు తేలింది. కొద్దిగా పరిశుభ్రత పాటించిన దుకాణాల్లో కలుషితాలు తక్కువగా ఉన్నట్టు తేలింది. తోపుడు బండి వద్ద ఉంచే చెత్త డబ్బా నుంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయి తిరిగి ఆహార పదార్థాలపైకి చేరుతున్నట్టు గుర్తించారు. అలాగే ప్లేట్లు శుభ్రం చేయకపోవడం వల్ల 60 శాతం శాంపిళ్లలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది. పానీ పూరీతోపాటు పండ్ల రసాలు, సమోసాలపైనా పరీక్షలు జరిపారు. సమోసాలు వేడిగా ఇస్తుండడంతో ఇందులో బ్యాక్టీరియా ఉండడం లేదని తేలింది. మిగతా పదార్థాల్లో మాత్రం ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని ఏపీఎం విభాగ హెడ్ విమలాథామస్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్మయి, విద్యార్థులు తెలిపారు. జంట నగరాల్లోని 80 ప్రాంతాల్లో ఐదు నెలలపాటు పర్యటించి, నమూనాలు సేకరించినట్టు పేర్కొన్నారు. సమోసా మినహా మిగతా వాటిలో 54 శాతం శాంపిళ్లు రోగాలకు కారణమవుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వాటిలో ప్రమాదకర ఈకోలి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా అంచనాలకు మించి ఉందని వివరించారు. ఈకోలి కారణంగా వాంతులు విరేచనాలు అవుతాయని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగా సాల్మొనెల్లాతో టైఫాయిడ్ జ్వరం వస్తుందని తెలిపారు. సో.. తస్మాత్ జాగ్రత!

  • Loading...

More Telugu News