: 83 యుద్ధ విమానాలు, 15 చాపర్లు, 464 ట్యాంకర్లు... రూ. 67 వేల కోట్లతో మోదీ సర్కారు షాపింగ్ లిస్టిది!


భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా, దాదాపు రూ. 67 వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ ఎత్తున యుద్ధవిమానాలు, ట్యాంకర్లు తదితరాలను కొనుగోలు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అయితే, వీటిని ఇండియాలోనే తయారు చేయాలన్న నిబంధన విధించనుంది. మొత్తం 83 తేజాస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 15 లైట్ కాంబాట్ హెలికాప్టర్లు, 464 టీ-90 ట్యాంకులను కొనుగోలు చేయనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే తేజాస్ విమానాల తయారీని పూర్తిచేయగా, కేంద్రం నుంచి తీసుకున్న ఆర్డర్ మేరకు 40 విమానాల డెలివరీ ప్రారంభించింది. హెచ్ఏఎల్ కు ఇచ్చిన కాంట్రాక్టు విలువ రూ. 50 వేల కోట్లకు పైమాటే! ఇక ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి అవసరమైన సరకు రవాణా లక్ష్యంగా రూ. 2,911 కోట్లతో హెలికాప్టర్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి రూ. 13,448 కోట్లతో ట్యాంకర్లను కేంద్రం కొనుగోలు చేయనుంది. వీటితో పాటు మోదీ సర్కారు షాపింగ్ లిస్టులో డ్రోన్లు కూడా ఉన్నాయి. మొత్తం 598 చిన్న మానవరహిత విమానాలు కొనుగోలు చేయాలని కూడా భారత సైన్యం నిర్ణయించింది. కాగా, తమిళనాడులోని సులూరులో ఈ సంవత్సరం జూలైలో తేజాస్ స్క్వాడ్రన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక్కో స్క్వాడ్రన్ లో 14 నుంచి 16 విమానాలు ఉంటాయి. ఇప్పటివరకూ రెండు తేజాస్ విమానాలను హెచ్ఏఎల్ డెలివరీ ఇచ్చింది. ఈ విమానాలకు ప్రాథమిక అనుమతులు వచ్చేయే తప్ప, తుది అనుమతులు ఇంకా రాలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News