: ఎన్డీటీవీపై నిషేధం నిలిపివేత.. నిరసనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
జాతీయ టీవీ చానల్ ఎన్డీటీవీపై విధించిన ఒకరోజు నిషేధాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడి సందర్భంగా ఎయిర్ బేస్‌లోని అతి సున్నిత ప్రాంతాలను చానల్ ప్రసారం చేసిందనే ఆరోపణలతో ఈనెల 9న 24 గంటలపాటు ప్రసారాలను నిలివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై చానల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రతిష్ఠ పాలుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిషేధాన్ని నిలిపివేసింది. కాగా తాము ప్రసారం చేసిన సమాచారాన్నే ఇతర చానళ్లు కూడా ప్రసారం చేశాయని, వాటిపై లేని నిషేధం తమపై ఎందుకంటూ ఎన్డీటీవీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై చానల్ వర్గాలు హర్షం చేశాయి.