: 'యోగాలో చివరి ఆసనం ఏమిటి?.. అది తెలియనప్పుడు కేసు ఎందుకు' అంటూ న్యాయవాదికి చీఫ్ జస్టిస్ ఠాకూర్ మొట్టికాయలు
ప్రభుత్వ పాఠశాలల్లో యోగ విద్యను విధిగా బోధించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యమేసిన ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అడిగిన ప్రశ్నతో దిమ్మదిరిగింది. ‘‘యోగాలో చివరి ఆసనం ఏమిటి?’’ అంటూ సీజే లాయర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన తెల్లమొహం వేశారు. సమాధానం చెప్పేందుకు తత్తరపడ్డారు. దీంతో సీజే తిరిగి కల్పించుకుని ‘‘ఆమాత్రం తెలియదా.. శవాసనం’’ అని పేర్కొన్నారు. యోగాలో ఆఖరి ఆసనమేంటో తెలియనప్పుడు కేసెందుకని ప్రశ్నించారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎంఎస్ కృష్ణమణి సోమవారం వాదనలు వినిపించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న కాలుష్య వాతావరణంలో ఎవరైనా యోగా చేయగలరా? అని ప్రశ్నించిన ధర్మాసనం వెంటనే రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరింది.