: పేదల కోసం ‘దివ్య దర్శనం’.. ఉచితంగా దేవాలయాల సందర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ఆర్థిక స్తోమత లేని వారి కోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ‘దివ్య దర్శనం’ పేరుతో పేదలను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి ఈ పథకం వర్తిస్తుంది. తిరుమల- తిరుపతి, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంతోపాటు మరికొన్ని క్షేత్రాలకు పేదలను తీసుకెళ్తారు. ఏటా ఒక్కో జిల్లా నుంచి పదివేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దర్శనం, తీర్థప్రసాదాల బాధ్యత కూడా దేవాదాయ శాఖే తీసుకుంటుందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భక్తులను ఎంపిక చేస్తామని, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని తీసుకుళ్లే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఒక్కో మండలం నుంచి లాటరీ ద్వారా 200 మందిని ‘దివ్య దర్శనం’ కోసం ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఇందుకు అర్హులు. త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.