: అరుదైన చికిత్స.. మహిళ కిడ్నీ నుంచి 7 కిలోల కణితిని తొలగించిన న్యూఢిల్లీ వైద్యులు
న్యూఢిల్లీలోని బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ఓ మహిళ(35) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. అరునెలల నుంచి ఆమె పొట్ట అసాధారణ రీతితో పెరుగుతున్నట్లు గమనించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమె కీడ్నీలో భారీ కణితి ఉందని తేల్చారు. అది మరింత పెరుగుతూ ఉండడంతో ఇటీవలే ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆరు గంటల ఆపరేషన్ జరిపి ఓ మహిళ మూత్రపిండంలో పెరుగుతోన్న 7 కేజీల కణితిని తొలగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ... ఆమెకు కిడ్నీలో కణితి ఏర్పడడం వల్ల అంతర్గత రక్త స్రావానికి దారితీసిందని, దీంతో ఆమెకు ప్రాణహాని ఉండడంతో ఆపరేషన్ చేసి కణితిని తొలగించామని చెప్పారు. కిడ్నీల్లో 7 కేజీల కణితిని ఇంతవరకు ఎక్కడా తొలగించలేదని, తాము విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు. మహిళ కిడ్నీలకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ను జరిపామని చెప్పారు. ఈ పెద్ద కణితితో పాటు ఆమె కిడ్నీల్లోంచి మరో మూడు చిన్న కణితలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు.