: నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేపిన రోగి.. అనంతరం ఐఐఐటీ కళాశాలలోకి ప్రవేశించి అలజడి
కృష్ణా జిల్లాలోని నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో రవి అనే ఒక రోగి కలకలం రేపాడు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో తాను చికిత్స తీసుకుంటున్న మంచంపై నుంచి లేచి కిటికీ అద్దాలు ధ్వంసం చేసి, వార్డు బాయ్‌ని కొట్టాడు. తరువాత ఆసుపత్రి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి నూజివీడు ఐఐఐటీ కళాశాలలోకి ప్రవేశించాడు. అక్కడ కూడా కలకలం రేపుతున్న రవిని కళాశాల సిబ్బంది చివరకు పట్టుకుని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కలకలం రేపిన రవిది ముసునూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామం. కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అతడికి చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని చెప్పారు. పురుగుల మందు తాగడం వల్ల రవి నాడీ వ్యవస్థపై ఆ మందు ప్రభావం చూపించడమే ఇలా బీభత్సం సృష్టించడానికి కారణమయి ఉండవచ్చని తెలిపారు.