: దక్షిణ సూడాన్ బార్‌లో కాల్పుల మోత... 9 మంది మృతి.. 11 మందికి గాయాలు
దక్షిణ సూడాన్ రాజధాని జూబాలో ముష్కరులు రెచ్చిపోయారు. ఓ బార్‌లోకి ప్రవేశించిన ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బార్‌లో ఉన్న వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసిన టీవీల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గాయపడిన మరో 11 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.