: నయీమ్‌తో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు: విచారణ అనంతరం విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు ఈ రోజు అదనపు ఎస్పీ సాయికృష్ణ సమక్షంలో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. అనంతరం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నయీమ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. తాను సాక్షిగానే విచారణలో పాల్గొన్నానని అన్నారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. మళ్లీ సిట్ విచారణకు రమ్మంటే వస్తానని అన్నారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని రవీందర్‌రెడ్డి అన్నారు. నయీమ్‌తో తనకు వ్యక్తిగతంగా పరిచయం లేదని చెప్పారు. తాను పోలీసు అధికారిగా పనిచేశాను కాబట్టి, తనకు శత్రువులు చాలా మందే ఉంటారని, ఆరోపణలు గుప్పిస్తుంటారని అన్నారు. నయీమ్ అక్రమాలకు పాల్పడడం తప్పని, అధికారులు చట్టప్రకారం ముందుకు వెళుతున్నారని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, అనుమానం ఉంటే పిలిపించి విచారిస్తున్నారని పేర్కొన్నారు. నయీమ్ చేసిన సెటిల్‌మెంటుల్లో తనకు ఒక్కదానిలో కూడా సంబంధం లేదని రవీందర్‌రెడ్డి అన్నారు. బేగంపేటలో తనకు భూమి ఉందని వస్తోన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, అప్పుడే నయీమ్ లాంటి వారి ఆటలు ఆదిలోనే అంతమవుతాయని చెప్పారు. సిట్ అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారని అన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారిస్తున్నారని చెప్పారు.