: కూతురి ప్రాణాలు తీసిన తల్లి.. ఆపై త‌న బిడ్డ‌ను కిడ్నాప్ చేశారంటూ ఐదేళ్ల పాటు డ్రామా!


అమెరికాలోని ప‌శ్చిమ వ‌ర్జీనియా ప్రాంతంలో ఐదేళ్ల క్రితం అదృశ్య‌మైన ఓ మూడేళ్ల చిన్నారి కేసులో ఆ పాప త‌ల్లిని పోలీసులు తాజాగా అరెస్టు చేసి, ప‌లు నిజాలు వెల్ల‌డించారు. ఆలియా లన్స్‌ఫోర్డ్ అనే మూడేళ్ల త‌న పాప అదృశ్య‌మైందంటూ ఆమె తల్లి లినల్‌ లన్స్‌ఫోర్డ్‌ 2011 సెప్టెంబర్‌లో అక్క‌డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం ఐదేళ్లుగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొంద‌రిని విచారించినా పోలీసుల‌కి ఆధారాలు ల‌భించ‌లేదు. పాప‌ ఆచూకి తెలిపితే 20,000 డాలర్లను బ‌హుమ‌తిగా ఇస్తామని కూడా ప్రకట‌న చేశారు. ఆ పాప ఫోటోను తీసుకుని ఇప్పుడు ఈ వయసులో ఎలా వుంటుందో ఊహా చిత్రాలను రూపొందించి పోస్టర్లను విడుద‌ల చేసినా పాప ఆచూకీ ల‌భించ‌లేదు. చివరకు పోలీసుల‌కి ఆ చిన్నారి త‌ల్లిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా చివ‌రికి త‌న‌ కూతురిని తానే చంపినట్లు ఒప్పుకుంది. తాను త‌న బిడ్డ‌ను తలపై పదునైన వస్తువుతో బలంగా కొట్టడంతోనే చ‌నిపోయింద‌ని చెప్పింది. ఐదేళ్ల పాటు పాప కోసం గాలించిన పోలీసులు చివరికి తల్లే ఆమె ప్రాణాలు తీసింద‌ని తేల్చిచెప్పారు. లీనల్‌ లన్స్‌ఫోర్డ్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాప మృతదేహం ఏమైందన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ఆ పాపని కొట్టినప్పుడు త‌ల్లి కవలపిల్లలతో గర్భవతిగా ఉంది. పాప క‌నిపించ‌కుండా పోయిందంటూ కేసు పెట్టిన తర్వాత ఆమె.. సంక్షేమ నిధుల‌ అక్రమాలకు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌లతో ఓ కేసులోనూ నిందితురాలిగా ఉంది. భర్తతో గొడ‌వ‌లుప‌డి విడాకులు కూడా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఆరుగురు పిల్లల త‌ల్లి అయిన లినల్‌ లన్స్‌ఫోర్డ్ కు తల్లిగా ఆమెకున్న హక్కులను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అక్క‌డి న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News