: ఒక్క చాక్లెట్ చోరీకి గురైంది... 6,500 చాక్లెట్లు తిరిగివచ్చాయి!
ఒక్క చాక్లెట్ పోగొట్టుకున్న ఓ యువకుడు అనంతరం కొన్ని రోజులకి 6,500 చాక్లెట్లను ఉచితంగా పొందిన సంఘటన అమెరికాలో ఇటీవలే చోటు చేసుకుంది. కన్సాస్ యూనివర్సిటీ విద్యార్థి అయిన హంటర్ జబిన్స్ కి చాక్లెట్లంటే చాలా ఇష్టం. ఆయన కొన్ని రోజుల క్రితం తన కారులో బయటకి వెళ్లాడు. అతడి కారులో కిట్‌క్యాట్ చాక్లెట్ ఉంది. అయితే, ఓ షాప్‌కి వెళదామనుకున్న జబిన్స్.. కారుని ఆ షాపు ముందు ఆపి డోర్‌లాక్ చేయకుండానే వెళ్లాడు. ఇంతలో గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి కారులో ఉన్న చాక్లెట్‌ను చోరీ చేశాడు. అయితే, సదరు చాక్లెట్ దొంగ ఆ కారులో ఓ చీటి రాసిపెట్టి వెళ్లాడు. అందులో తనకు కిట్‌క్యాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టమని అంతేగాక, తాను ఆకలిగా ఉన్నానని పేర్కొన్నాడు. ఆ కారు డోర్ లాక్ వేయకపోవడంతో తాను అందులో ఉన్న చాక్లెట్‌ను తీసుకున్నానని, కారులోంచి వేరే వస్తువులేవీ తీసుకోలేదని రాశాడు. తన చాక్లెట్ చోరీకి గురైనందుకు మొదట కోపం తెచ్చుకున్న జబిన్స్ చోరీ చేసిన వ్యక్తి రాసిన చీటిని చూసి పోనీలే అనుకున్నాడు. చాక్లెట్ దొంగ రాసిన చీటీని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టు అంతర్జాలంలో చక్కర్లు కొట్టంది. చివరకు కిట్‌క్యాట్ చాక్లెట్ కంపెనీకి చేరింది. దీంతో సదరు కంపెనీ జబిన్స్‌కు ఒక్క చాక్లెట్‌కు బదులుగా 6,500 చాక్లెట్లను పంపించి ఆశ్చర్యపరిచింది. దీంతో ఎంతో హర్షం వ్యక్తం చేసిన ఆ యువకుడు చాక్లెటన్నింటినీ కారులో వేసుకొని తన యూనివర్సిటీకి వచ్చి, తన తోటి విద్యార్థులందరికి పంచి పెట్టాడు. ఒక్క చాక్లెట్ పోతేనేం వేలకొద్దీ చాకెట్లు వచ్చాయని మురిసిపోయాడు.