: అన్ని పార్టీల వాళ్లం ఏకమవుదాం... పోరాడుదాం: మమతా బెనర్జీ
దేశంలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయని... దీనికంతటికీ కారణమైన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని పార్టీలు కలసి రావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మాజీ సైనికోద్యోగి రాంకిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లను అడ్డుకోవడం... భోపాల్ లో సిమి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయడం... ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు నిషేధించడం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, అన్ని పార్టీల వాళ్లం కలిసి కూర్చుని, మాట్లాడుకుందామని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదామని అన్నారు. మమత పిలుపును కాంగ్రెస్, ఆప్, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీలు స్వాగతించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తాము సిద్ధమని ప్రకటించాయి. మరోవైపు, మమత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన సొంత రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమె దృష్టి సారిస్తే మంచిదని సూచించింది.