: అఖిలేష్ కి పోటీగా రథయాత్ర... 400 చిన్న రథాలు సిద్ధం చేసిన బీజేపీ


వికాస్ రథయాత్ర పేరిట ఉత్తరప్రదేశ్ ను చుట్టి రావాలని సీఎం అఖిలేష్ యాదవ్ నిశ్చయించుకున్న వేళ, పోటీగా రథయాత్రలు సాగించాలని భావిస్తున్న బీజేపీ ఏకంగా 400 చిన్న రథాలను తయారు చేయించింది. ఈ మేరకు ఇన్నోవా కార్లను బీజేపీ రథాలుగా అలంకరించింది. ఇవన్నీ వారం రోజుల పాటు అన్ని గ్రామాల్లోని వీధి వీధినీ చుట్టి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే పరివర్తన్ యాత్ర పేరిట బీజేపీ ఎన్నికల ర్యాలీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్న రథాలు డిసెంబర్ ప్రారంభం నుంచి తొలి దశ ప్రచారంలో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఎన్డీయే సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్ల ద్వారా డిజిటల్ పబ్లిసిటీ చేస్తామని, అఖిలేష్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తయారు చేసిన లఘుచిత్రాలను ఇవి వీధి కూడళ్లలో ప్రదర్శిస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండు స్లోగన్లతో తమ ప్రచారం సాగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. 'నా గూండారాజ్, నా బ్రష్టాచార్, అబ్ కీ బార్ బీజేపీ సర్కార్', 'పూర్ణ బహుమత్, సంపూర్ణ వికాస్, భాజాపా పర్ హై విశ్వాస్' స్లోగన్లతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News