: సోనియా హాజరు కానివేళ, రాహుల్ ఆధ్వర్యంలో సాగిన అతి ముఖ్యమైన కాంగ్రెస్ సమావేశం


అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుండానే సాగింది. అనారోగ్యం కారణంగా సోనియా గైర్హాజరు కావడంతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ భేటీలో ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు సాగాయి. వచ్చే సంవత్సరం యూపీ, పంజాబ్ సహా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలపైనా నేతలు చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాహుల్ బృందం చర్చించింది. కాగా, రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రారంభం కావడం గమనార్హం. పార్టీలో సంస్థాగత ఎన్నికలు ఈ డిసెంబర్ చివరికి పూర్తి కావాల్సి వుండగా, వాటిని సైతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News