: మద్యపాన నిషేధంపై చట్టం తీసుకొచ్చేంతవరకు పోరాడుతా: అన్నా హజారే ప్రకటన
జన్ లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించి విజయం సాధించిన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మద్యపాన నిషేధంపై పోరాటానికి దిగనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యసనం బారిన పడి ఎన్నో కుటుంబాలు కష్టాలు ఎదుర్కుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మద్యపానం వల్ల కుటుంబాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకే తాను మద్యపానం నిషేధంపై ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నిషేధంపై చట్టం తీసుకొచ్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఈ అంశంపై తాము ముసాయిదా కూడా తయారు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇచ్చినట్లు, సీఎం నుంచి ఈ అంశంపై సానుకూల స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.